భుజంపై కొడుకు శవంతో తండ్రి నడక.. హృదయాన్ని కలిచివేసే వీడియో..!

ఒడిషాలోని రాయగడ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కొడుకు మృతదేహాన్ని 1.5 కిలోమీటర్ల దూరం భుజంపై మోసుకెళ్లాడు. ఉచిత అంబులెన్స్ సర్వీస్ లేదని జిల్లా ఆస్పత్రి అధికారులు చెప్పడంతో చేసేది లేక తన కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని ఇంటికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అందరినీ కలిచివేస్తోంది.. రాయగడ్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

సురాధర్ బెనియా అనే వ్యక్తికి 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు రెండు రోజులుగా డయేరియాతో బాధపడుతున్నాడు. దీంతో తండ్రి బెనియా కొడుకును ఆదివారం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అయినా ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. అంబులెన్స్ అందుబాటులో లేదని అధికారులు చెప్పారు. 

దీంతో చేసేది లేక ఉబికి వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ కొడుకు మృతదేహాన్ని భుజంపై వేసుకొని తండ్రి బయలుదేరాడు. కుటుంబ సభ్యులు సైతం వెనుక ఏడుస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు. దీనిని బైక్ వస్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది.. 

ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. రాయగడ్ జిల్లా కలెక్టర్ సరోజ్ కుమార్ మిశ్రా దీనిపై విచారణకు ఆదేశించారు. తగినన్ని మహా ప్రయాణ్ వాహనాలు అందుబాటులో ఉన్నా ఎందుకు ఇవ్వలేదనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా.. గతంలోనూ ఇదే రాష్ట్రంలో ఓ వ్యక్తి అంబులెన్స్ కి డబ్బులు లేక తన భార్య మృతదేహాన్ని 12 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. 

 

Leave a Comment