దారుణం : చాక్లెట్లు తిని ముగ్గురు తోబుట్టువులు సహా నలుగురు చిన్నారులు మృతి..!

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డుపక్కన పడి ఉన్న టాఫీ(చాక్లెట్లు) తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలతో సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పు యూపీలోని ఖుషీ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు కాస్య పోలీస్ స్టేషన్ పరిధిలోని సిసార్ గుర్మియా గ్రామంలో పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు.. 

వారికి రోడ్డుపై టాపీలు, తొమ్మిది రూపాయల నగదు లభించింది. ఈ టాఫీలను మంజన్(7), ఆమె చెల్లెలు స్వీటీ (5), సోదరుడు సమర్ (3), పొరుగున నివసించే ఆరుష్(6) తిన్నారు.. తిన్న కొద్ది సేపటికి స్పృహతప్పి కిందపడిపోయారు. దీంతో గ్రామస్తులు అంబులెన్స్ కి ఫోన్ చేశారు. అయితే ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో ఒక్కొక్కరిని బైక్ పై ఎక్కించుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నలుగురు చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 

మరణానికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని వైద్యులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారని, అయితే సంఘటన వెనుక ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని గోరఖ్‌పూర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) జే రవీందర్‌ గౌడ్‌ తెలిపారు. ఒకేసారి నలుగురు చిన్నారులు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  

ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా స్పందించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని, అలాగే ఘటనపై విచారణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

 

Leave a Comment