కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారుల్లో లక్షణాలు..!

కేరళలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో ఈ కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండు నోరో వైరస్ కేసులు గుర్తించారు. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరో వైరస్ సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

విజింజంలోని ఎల్‌ఎంఎస్‌ఎల్‌పీ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజనింగ్‌, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపగా అందులో ఇద్దరికి నోరో వైరస్  ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. 

నోరో వైరస్ నిర్ధారణ కావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని, ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ తెలిపారు. 

నోరో వైరస్ లక్షణాలు:

నోరో వైరస్ అనేది అంటువ్యాది. ఇది ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరో వైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందవచ్చు. నోరో వైరస్‌ సోకిన రోగులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. 

 

Leave a Comment