మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ..!

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నూపుర్ శర్మ తెలిపారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. 

జ్ఞానవాపి మసీదుపై చర్చ సందర్భంగా ఆమె మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ముస్లిం వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. అంతే కాదు.. అరబ్ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో నూపుర్ శర్మ ట్విట్టర్ స్పందించారు. ‘గత చాలా రోజులుగా మహాదేవ్ శివుడిని అవమానిస్తూ.. అగౌరవపరుస్తుండటంతో నేను సహించలేకపోయాను. జ్ఞానవాపి మసీదు వద్ద లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా  అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై  ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా’ అని నూపుర్ శర్మ చెప్పారు.

 

Leave a Comment