తెలంగాణలో నో లాక్ డౌన్..స్పష్టం చేసిన కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధంచడం వల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధించకూడదనే విషయంలో సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. భారత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా తెలంగాణ ఉందన్నారు. ఇక్కడ 20 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారన్నారు. 

కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ విధిస్తే వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని చూశామన్నారు. వీరంతా వెళ్లిపోతే తిరిగి రావడం కష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండిందన్నారు. లాక్ డౌన్ విధిస్తే మొత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందన్నారు. 

అదే సమయంలో నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, పండ్లు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుధ్యం వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, ఆక్సిజన్ తో పాటు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నామని, ఒక వేళ లాక్ డౌన్ విధిస్తే వీటన్నీంటికీ ఆటంకం ఏర్పడుతుందని వెల్లడించారు. ఇన్ని కారణల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, కాబట్టి లాక్ డౌన్ విధించలేమని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు..

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కేసీఆర్ కోరారు. ఎవరికైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందుస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని చెప్పారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా మెడికల్ కిట్లను ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు. 

Leave a Comment