నివర్ తుఫాన్ : ఏపీకి భారీ వర్ష సూచన..!

ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. ఈ తుఫాన్ కు ‘నివర్’గా నామకరణం చేసినట్లు చెప్పారు. నివర్ తుఫాన్ ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందన్నారు. 

రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్ గా మారునుందని పేర్కొన్నారు. ఈనెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటలకు  65-85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. 

నివర్ తుపాను  ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ముందస్తుగా నెల్లూరు జిల్లాకు ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్  సహాయక బృందాలు పంపినట్లు తెలిపారు.  

ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం  చేస్తున్నామన్నారు.  సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.  రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

 

Leave a Comment