సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి శ్రీకారం..

సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరమితితో అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే బియ్యం కార్డు, 10 రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇట్ట పట్టాలు అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అనంతరం ఆయన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 

సమీక్ష సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. 

  • లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి.
  • అర్హత వివరాలు, దరఖాస్తు చేసుకునే సమాచారం కూడా అందించాలి. 
  • దరఖాస్తును గడువులోగా వెరిఫికేషన్ చేయాలి. 
  • లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను డోర్ డెలివరీ చేయాలి.
  • బయోమెట్రిక్ అక్నాలెడ్జ్ మెంట్ తీసుకోవాలి.
  • నిర్ణీత సమయంలోగా ఆ సేవలు అందించలేకపోతే వారికి పరిహారం కూడా చెల్లిస్తాం.

ఇళ్ల నిర్మాణంపై సమీక్ష..

ఇళ్ల నిర్మాణం కోసం ఎవరైనా మిగిలిపోతే అప్లికేషన్లు పెట్టమని చెప్పామని అధికారులు సీఎంకు వివరించారు. వాటి పరిశీలన కూడా పూర్తవుతోందని అన్నారు. ఇప్పటి వరకు 30.3 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులు తెలిపారు. 

జూన్ 12 లోపు లబ్ధిదారుల తుది జాబితాను ప్రదర్శించాలని సీఎం తెలిపారు. జూన్ 15 లోపు పాత లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. జూన్ 30 కల్లా కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు అవరసమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

 

Leave a Comment