2-డీజీ కరోనాకు కొత్త ఔషధం : డీఆర్డీఓ చైర్మన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈక్రమంలో తాజాగా కరోనా మహమ్మారిపై బ్రహ్మాస్తం లాంటి ఔషధాన్ని డీఆర్డీఓ(DRDO) సిద్ధం చేసింది. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ(2-DG) ఔషధం గురించి డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి వివరించారు..

ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-డీజీ మందును కచ్చితంగా ఓ గేమ్ చేంజర్ గా భావించవచ్చని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు 2-DG సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. 2-DG జనరిక్ మాలిక్యూల్ అని, కొన్ని ప్రయోగాల్లో భాగంగా దీన్ని రూపొందించామని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ లో ఫలితాలు బాగా వచ్చాయన్నారు. ఈ డ్రగ్ వాడితే మూడు రోజుల ముందే కోలుకుంటున్నారన్నారు. ఈ డ్రగ్ కు డీజీసీఐ అత్యవసర అనుమతి ఇచ్చిందన్నారు. 

2-DG ఔషధం ఉత్పత్తిపై డా.రెడ్డిస్ ల్యాబ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సతీశ్ రెడ్డి తెలిపారు. 11,12 తేదీల్లో 10 వేల ప్యాకెట్లు రానున్నాయన్నారు. అయితే ఒకేసారి భారీగా ఉత్పత్తి చేయడం కష్టమని, అన్నీ సమకూరితే నెల రోజుల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తేవచ్చని అన్నారు. 2-DG ఔషధం వ్యాధి వచ్చిన తర్వాత వాడే మందు అని, వ్యాధి రాకుండా ఆపే మందు కాదని స్పష్టం చేశారు. 

2-DG ఔషధం వాడితే రోగులు వేగంగా రికవరీ అవుతారని, ఆక్సిజన్ పెట్టాల్సిన స్థాయికి వెళ్లే రోగులకు ఆ అవసరం లేకుండా చేస్తుందని సతీశ్ రెడ్డి తెలిపారు. ఒకవేళ అప్పటికే ఆక్సిజన్ వాడుతున్నా.. త్వరగా బయటపడేలా చేస్తుందన్నారు. అంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరాన్ని, ఎక్కువ రోజులు ఉండాల్సి రావడాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ ఔషధం నేరుగా కరోనా వైరస్ తో సంబంధం లేదని, కరోనా సోకిన మన శరీర కణాల మీద ఈ మందు పనిచేస్తుందని అన్నారు. కణాల్లోకి 2-DG ప్రవేశించాక దానిని పూర్తిగా స్తంభింపజేస్తుందన్నారు. దీంతో అక్కడ వైరస్ పెరగడం ఆగిపోతుందన్నారు. అంటే 2-DG ఔషధం ఏ స్ట్రెయిన్ అనే తేడా లేకుండా పనిచేస్తుందని సతీశ్ రెడ్డి వెల్లడించారు. 

 

Leave a Comment