ఆయనే నా భర్త.. పెళ్లిపై నయనతార క్లారిటీ..!

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరు. అయితే 36 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుదేవా, శింబులతో ప్రేమాయణం నడిపి వారి నుంచి విడిపోయింది. ఇప్పుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. వీరి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తుంటుంది. అయితే ఇప్పటివరకు పెళ్లి గురించి వీరు బహిరంగంగా మాట్లాడలేదు. 

తొలిసారిగా నయనతార తన పెళ్లి గురించి పెదవి విప్పారు. ఇటీవల ఓ తమిళ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విఘ్నేష్, తన కుటుంబ సభ్యుల సమయంలో ఇద్దరి నిశ్చితార్థం జరిగిందన్నారు. పెద్దగా సంబరాలు చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని, అందుకే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నామని వెల్లడించారు. 

ఇంకా తమ వివాహ తేదీ ఖరారు కాలేదని, ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే తన అభిమానులకు చెబుతానని నయనతార అన్నారు. రహస్యంగా అయితే పెళ్లి చేసుకోనని స్పష్టం చేశారు. తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. విఘ్నేష్ తన బాయ్ ఫ్రెండ్ స్టేజ్ దాటి పోయాడని, ఆయన తనకు కాబోయే భర్త అని అన్నారు. మీడియా కూడా ఇకపై వారి కథనాల్లో ఇలాగే రాస్తారని ఆశిస్తున్నానని నయన్ పేర్కొన్నారు.  

Leave a Comment