ఉగ్రవాదులుగా భావించి కూలీలపై ఆర్మీ జవాన్ల కాల్పులు..13 మంది మృతి..!

ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాలు సామాన్య పౌరులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాగాలాండ్ లోని మోన్ జిల్లా ఓటింగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ చర్యను నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్మీకి చెందిన పలు వాహనాలకు నిప్పంటించారు. దీంతో నాగాలాండ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఒటింగ్ గ్రామం మరియు తిరు బొగ్గు గని మధ్యలో మిలిటెంట్లు ఉన్నట్లు ఆర్మీ జవాన్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఆపరేషన్ చేపట్టాయి. అదే సమయంలో బొగ్గ గనిలో పనులు ముగించుకొని కొందరు కార్మికులు పికప్ ట్రక్ పై ఇళ్లకు బయల్దేరారు. మిలిటెంట్లుగా భావించిన జవాన్లు ఆ ట్రక్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది కార్మికులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. 

అయితే తమ వారు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఓటింగ్ గ్రామం నుంచి కొందరు గాలించేందుకు వెళ్లారు. వారికి తమ వారి మృతదేహాలు కనిపించాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆర్మీ జవాన్ల వాహనలకు నిప్పంటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ఘటనపై నాగాలాండ్ సీఎం నెయ్ ప్యూ రియో స్పందించారు. భద్రతా దళాల కాల్పుల్లో సామాన్య పౌరులు మరణించడం దురదృష్టకరం అన్నారు. దీనిపై సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ 3 కోర్ కూడా స్పందించింది. పౌరులు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది. 

అమిత్ షా సంతాపం:

ఓటింగ్ వద్ద జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. సామాన్య పౌరులు మరణించడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు.  

 

  

Leave a Comment