‘చనిపోతాం.. అనుమతివ్వండి’.. హైకోర్టుకు 600 మంది ముస్లిం మత్స్యకారులు..!

గుజరాత్ లోని పోర్ బందర్ జిల్లాలోని గోసబర్ కు చెందిన 600 మంది ముస్లిం మత్స్యకారులు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న పేద ముస్లిం మత్స్యకారులు ఉన్నట్టుండి ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే.. 

గుజరాత్ లోని గొసబరాలో దాదాపు వంద వరకు ముస్లిం మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి జీవనధానం చేపలు పట్టడమే.. తీరప్రాంతంలో పడవలు నిలిపేందుకు, చేపల వేటకు వీరి వద్ద లైసెన్సులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ గుజరాత్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారిని అనుమతించడం లేదని గొసబరా ముస్లిం మత్స్యకార సొసైటీ సభ్యులు పిటిషన్ లో పేర్కొన్నారు. 

అయితే ఈ ఆంక్షలు మిగతా వర్గాల వారికి లేవని, కేవలం తమపై మాత్రమే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి తమను వేధిస్తున్నారని, దీంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇటీవల రాజకీయ వేధింపులు కూడా తోడయ్యాయని తెలిపారు. 

ఈ సమస్యను పరిష్కరించాలని అధికార నేతలతో పాటు గవర్నర్ వరకు తీసుకెళ్లామని, అయినా ఫలితం లేదని వాపోయారు. తమ కుటుంబ పోషణ భారమైందని, దీంతో కారుణ్య మరణానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం ముస్లిం మత్స్యకారుల పట్ల వివక్ష చూపుతోందని తెలిపారు.   

  

 

Leave a Comment