ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని.. బిల్డింగ్ ని తగులబెట్టాడు.. 7 మంది మృతి.. ప్రియురాలు మాత్రం సేఫ్..!

తాను ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి నివసిస్తున్న మూడంతస్తుల భవనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటనలో 7 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరగినట్లు భావించారు. కానీ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. 50కి పైగా సీసీటీవీ ఫుటేజీల్లో సంజయ్ ని పోలీసులు గుర్తించారు. ఘటనకు కాసేపటి ముందు అతడు ఆ బిల్డింగ్ లోకి వెళ్లినట్లు గుర్తించారు. అతడే బిల్డింగ్ కి నిప్పంటించినట్లు వెల్లడైంది. 

మొదట అక్కడ ఉన్న ఓ స్కూటర్ పెట్రోల్ ట్యాంకులో నిప్పుపెట్టాడు. దీంతో మంటలు పార్కింగ్ ప్రాంతమంతా వ్యాపించాయి. ఆ తర్వాత మంటలు మొత్తం భవనాన్నే అలముకున్నాయి. ప్లాట్లలో నివాసం ఉంటున్న 7 మంది ఊపిరి ఆడక మంటల్లో కాలి బూడిదయ్యారు. కొందరు ప్రాణాలకు తెగించి బాల్కనీ, కిటికీల్లోంచి దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 

గతంలో సంజయ్ ఇదే బిల్డింగ్ లో నివాసం ఉండేవాడు. ఆరు నెలల క్రితమే ఫ్లాట్ ఖాళీ చేశాడు. కాగా ఇదే భవనంలో నివసిస్తున్న ఓ యువతిని సంజయ్ ప్రేమించాడు. కానీ ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. దీంతో ఆమెపై కోపంతో ఆమె నివసిస్తున్న బిల్డింగ్ కి నిప్పంటించాడు. అదృష్టవశాత్తు ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 

 

 

 

 

 

Leave a Comment