జూన్ నుంచి సినిమా షూటింగులు..

కరోనా వైరస్ ప్రభావంతో ఆగిపోయిన సినిమా షూటింగులు ప్రారంభం కానున్నాయి. షుటింగులు, ప్రీ ప్రోడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే షూటింగ్ల సమయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. సినిమా షూటింగులు, ప్రీప్రొడక్షన్ పునరుద్ధరణ, థియేటర్ల ప్రారంభంపై శుక్రవారం టాలీవుడ్ ప్రముఖలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

 సినిమా షూటింగులు ఎలా నిర్వహించాలనే దానిపై విధి విధానలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్లతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సీని రంగం ప్రముఖులు సీఎంను కోరారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తక్కువ మందితో ఇండోర్ లో చేసే వీలున్న ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవాలని చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్లు ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

అయితే సిని పరిశ్రమ బతకాలని, అదే సందర్భంలో కరోనా వ్యాప్తి కూడా జరగకూడదని, సీఎం తెలిపారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం వెల్లడించారు. 

 

Leave a Comment