కొడుకుతో కలిసి పది పరీక్షలు రాస్తున్న తల్లి.. చదువు పూర్తి చేయాలన్న కోరికతో..!

ఒడిశాలో మెట్రిక్యులేషన్ బోర్డు పరీక్షల్లో అరుదైన దృశ్యం కనిపించింది. శుక్రవారం ప్రారంభమైన బోర్డు పరీక్షలకు ఒక తల్లి తన కొడుకుతో కలిసి హాజరైంది. ఇద్దరు పదో తరగతి పరీక్షలు రాసేందుకు పరీక్ష హాలుకు వచ్చారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా పాఠశాలలు ఆన్ లైన్ లో పాఠాలు ప్రారంభిచాయి. 

ఈక్రమంలో జయపురం మండలం పూజారిపుట్ గ్రామానికి చెందిన జ్యోత్స్న పాధి(36) కొడుకు అలోక్ పదో తరగతి చదువుతున్నాడు. ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండటంతో అలోక్ ఇంటి వద్ద నుంచే చదువును కొనసాగించాడు. ఇది చూసిన జ్యోత్స్న కూడా తాను అర్ధాంతరంగా ముగించిన చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది. 

జ్యోత్స్న 15 ఏళ్ల క్రితం వివాహం కారణంగా చదువును ఆపేసింది. ఆమె భర్త త్రినాథ్ గ్రామంలో జాతీయ బ్యాంకు కియోస్క్ ను నడుపుతున్నాడు. మళ్లీ చదువును కొనసాగించాలనే జ్యోత్స్న కోరికను భర్త గమనించాడు. ఆమెను పాఠశాలలో చేర్పించాడు. దీంతో ఆమె ఇంటి నుంచే తన కొడుకుతో కలిసి పది పరీక్షలకు సిద్ధమైంది..

ప్రస్తుతం జరుగుతున్న బోర్డు పరీక్షలకు తల్లీకొడుకులు కలిసి హాజరవుతున్నారు. తన కొడుకుతో కలిసి తన చదువును కొనసాగించడం ఆనందంగా ఉందని జ్యోత్స్న తెలిపారు. తన భర్త ప్రోత్సాహంతో అర్ధాంతరంగా ముగించిన చదువును తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. ఆమె ఉత్సాహం, చదువును పూర్తి చేయాలనే కోరికను చూసి.. ఆమెను కారస్పాండెంట్ కోర్సులో చేర్పించినట్లు భర్త త్రినాథ్ తెలిపారు.  

 

    

Leave a Comment