70 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో డబ్బు, బంగారం దొంగలించిన కోతులు..!

ఓ వృద్ధురాలు జీవితాంతో కష్టపడి దాచిన సొమ్ము కోతుల పాలైంది. వృద్ధురాలు దాచుకున్న డబ్బు, బంగారంతో కోతులు ఉడాయించాయి. దీంతో ఆ వృద్ధురాలు లబోదిబో అంటోంది. తమిళనాడులోని తిరవైయారుకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలు జి.శరతంబల్ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె పని మీద బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో కోతులు చేరాయి. ఇంట్లో ఉన్న అరిటి పండ్లు, బియ్యం సంచి తీసుకొని పారిపోయాయి. ఆ బియ్యం సంచిలో శరతంబల్ తను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు, కొంత బంగారాన్ని దాచిపెట్టింది. అయితే కోతులు దాన్ని తీసుకొని పారిపాయాయి. 

ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధురాలికి ఇంట్లో బియ్యం సంచి కనిపించలేదు. దీంతో ఆమె కంగారు పడింది. బయటకు వచ్చి చూస్తే ఇంటి పైకప్పు మీద కోతులు బియ్యం సంచితో కనిపించాయి. ఆ బియ్యం సంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తే అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఆమె కోతులను వెంబడించింది. విషయం తెలిసిన స్థానికులు కూడా కోతులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ పట్టుకోలేకపోయారు. ఆ బియ్యం సంచిలో రూ.25 వేల నగదు, కొంత బంగారం ఉన్నట్లు శరతంబల్ తెలిపింది.   

Leave a Comment