హిందూపుం కోసం ఎమ్మెల్యే పదవికైనా రాజీనామా చేస్తానంటున్న బాలయ్య..!

ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తున్నట్లు ప్రకటించింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని పేర్కొంది. ఈక్రమంలో కొన్ని జిల్లాల పేర్ల మార్పు కోసం, మరి కొన్ని చోట్ల తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాలో కాకుండా పాత జిల్లాలో ఉంచాలని డిమాండ్లు వస్తున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రం మార్పు కోసం నిరసనలు వెల్లువెత్తాయి..

 ఈక్రమంలో హిందూపురం జిల్లా సాధన కోసం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించి.. జిల్లా కేంద్రంగా హిందూపురం కాకుండా పుట్టపర్తిని ప్రకటించింది ప్రభుత్వం.. దీంతో బాలకృష్ణ మౌన దీక్ష చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ముందుగా హిందూపురంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురం కోసం తాను దేనికైనా రెడీ అని అన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ బాలయ్య సవాల్ విసిరారు. హిందూపురాన్ని కాకుండా వేరే చోట జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లి కూడా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.    

Leave a Comment