మణిపూర్ లో ఉగ్రదాడి.. కమాండింగ్ అధికారి కుటుంబంతో సహా ఏడుగురు మృతి..!

మణిపూర్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. 46 అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్ పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కమాండింగ్ అధికారి విప్లవ్  త్రిపాఠి, ఆయన భార్య, కొడుకుతో పాటు నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ లోని చురాందర్ పూర్ జిల్లాలో ఉదయం 10 గంటలకు ఈ ఉగ్రదాడి జరిగింది.  

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ వెళ్తుండగా కొందరు ముష్కరులు కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కొడుకుతో పాటు మరో నలుగురు మరణించారు. మరి కొందరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విప్లవ్ దేవ్ సెలవు ముగించుకుని తిరిగి యూనిట్ లో చేరేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.   

మణిపూర్ కు చెందిన ఉగ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే ఏ గ్రూపు దాడికి బాధ్యత వహించిందో ఇంకా ప్రకటించలేదు. ఘటనా స్థలానికి పారామిలిటరీ బలగాలు చేరుకుని ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు..   

Leave a Comment