21 ఏళ్లకే మేయర్.. దేశంలో అత్యంత పిన్న వయస్సు మేయర్ గా రికార్డు..!

కేరళలో ఓ విద్యార్థి 21 సంవత్సరాలకే మేయర్ పదవిని దక్కించుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ గా ఆర్య రాజేంద్రన్ త్వరలో బాధ్యతలు చేపట్టనుంది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ గా ఆర్య రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఆర్య ప్రస్తుతం తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతోంది. 

ఇటీవల కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆర్య తిరువనంతపురంలోని ముడవగన్ ముగళ్ వార్డు కౌన్సిలర్ గా సీపీఎం టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి సత్తాచాటింది. 

దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. అయితే మేయర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. దీంతో ఆర్య రాజేంద్రన్ పేరును సీపీఎం జిల్లా నేతలు తెరపైకి తీసుకొచ్చారు. ఇక అగ్ర నాయకత్వం కూడా దానిని అంగీకరించింది. దీంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. 

ఆర్య రాజేంద్రన్ సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. సీపీఎం చిన్నారుల విభాగమైన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని, ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని ఆర్య తెలిపారు.  

 

Leave a Comment