ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చిన సీఎం జగన్..!

ఎన్నాళ్లో వేచిన పేదల చిరకాల స్వప్నం సాకారమైంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ లో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల లక్షల మంది అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని సీఎం జగన్ వెల్లడించారు. కాగా ఇంటి నిర్మాణానికి సంబంధించి అక్కాచెల్లెమ్మలకు మూడు ఆప్షన్లు సీఎం జగన్ ఇచ్చారు. 

  • ఆప్షన్ 1 – ప్రభుత్వం చూపిన నమూనా మేరకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు మీ చేతికి ఇస్తాం. మీరే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు. 
  • ఆప్షన్ 2 – లబ్ధిదారులే ఇంటి సామగ్రి తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. పనుల పురోగతిని బట్టి దశల వారీగా డబ్బులు మీ చేతికి ఇస్తాం.
  • ఆప్షన్ 3 – ప్రభుత్వమే స్వయంగా మంచి మెటీరియల్ తో ఇల్లు కట్టించి ఇస్తుంది. 

వీటిలో  ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. వాలంటీర్ల సహాయంతో మీకు కేటాయించిన స్థలం వద్ద ఉండాలని, అధికారులు, మీ దగ్గరకు వచ్చి మీకు డి-ఫామ్ పట్టాలు ఇస్తారని అన్నారు. మీ ఫొటోలు తీస్తారని, మీరు ఏ విధానంలో ఇల్లు కావాలో ఆ ఆప్షన్ కు టిక్ చేసి ఇవ్వాలని సూచించారు. ఇంకా అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. 

 

Leave a Comment