విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రామేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ హోటల్ లో 30 మంది కరోనా బాధితులు, 10 మంది సిబ్బంది, మొత్తం 40 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికీ 11 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు సమాచారం. 

తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. బాధితులను భవనంలోకి మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరలేదని, నిచ్చెనల ద్వారా కిందికి దించి ఇతర ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు. 

సీఎంకు ప్రధాని ఫోన్..

కోవిడ్ సెంటర్ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

రూ.50 లక్షలు ఎక్స్ గ్రేసియా..

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడించారు. 

చంద్రబాబు దిగ్భ్రాంతి..

స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

 

 

Leave a Comment