మార్కెటింగ్ సమస్యలు రాకూడదు..

చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని,  వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల విషయంలో మార్కెటింగ్‌  సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదని సీఎం తెలిపారు.  రైతులకు  అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. పంటలను రోడ్డు మీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవన్నారు. అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. 

వ్యవసాయ సలహామండళ్లు..

 రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలని సీఎం ఆదేశించారు.  ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని ఆర్‌బీకేల ద్వారా అవగాహన కలిగించాలన్నారు.  ఏ పంట వేస్తే మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముడు పోయే అవకాశాలున్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. 

 ప్రతి ఊర్లో కూడా ఏయే పంటలు ఎంత మేర పండించాలన్నదానిపై రైతులతో కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలన్నారు.  జాతీయ, అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆమేరకు కార్యాచరణ ఉండాలన్నారు.  రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు సీఎం ఆదేశించారు.  ఏయే పంటలు, ఎక్కడ ఎంత మేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాలన్నారు. 

 రాష్ట్రస్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు, జిల్లా స్థాయి బోర్డులకు, అక్కడ నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలన్నారు.  పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలన్నారు.  పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం.. ఈప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృతంగా కొనసాగాలన్నారు. 

Leave a Comment