లాక్‌డౌన్‌ పొడిగింపు సమష్టి నిర్ణయం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కిషన్‌రెడ్డి

ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలతో కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామన్నారు.  రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలు, కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించినట్లు చెప్పారు.

రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్‌ ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలని తెలిపారు. వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు.  26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు.  

40 జిల్లాల్లో గత 21 రోజులుగా కేసు కూడా నమోదు కాలేదని, కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.  ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశామన్నారు. . 

2.22లక్షల పీపీఈ కిట్లను సేకరించాలని నిర్ణయించామని, 30కోట్ల హైడ్రాక్సీ క్లరోక్విన్‌ మాత్రలు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. వలస కార్మికుల కోసం శుక్రవారం ఒక్క రోజే ఆరు రైళ్లు నడిపామని చెప్పారు.  వలస కార్మికులను తరలించేందుకు నేటి నుంచి 300కు పైగా రైళ్లు నడుపుతామని, వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయని తెలిపారు. 

ఎవరూ రైల్వే స్టేషన్లకు రావద్దు..

ఎవరూ రైల్వే స్టేషన్‌లోకి రావద్దని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే రావాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తామన్నారు.  దూరంతో సంబంధం లేకుండా రూ.50 టిక్కెట్‌ ధర నిర్ణయించామన్నారు.  టిక్కెట్‌ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలని తెలిపారు. 

 

Leave a Comment