మోడీని భార్యతో వెళ్లమనండి.. బీజేపీపై విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని..!

మంత్రి కొడాలి నాని బీజేపీపై విరుచుకుపడ్డారు. డిక్లరేషన్ అంశంలో ఇటీవల నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్ నుంచి తొలగించాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన డిమాండ్ పై మంత్రి కొడాలి నాని స్పందించారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. స్వామిపై నమ్మకంతో భక్తులు తిరుమలకు వస్తారన్నారు. శ్రీవారి దయవల్లే సీఎం జగన్ సీఎం అయ్యారన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడేనే సీఎంను ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలని ప్రశ్నించారు. 

 సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.  ప్రధాని మోడీని కూడా ఆయన భార్యను పక్కన పెట్టుకుని వెంకటేశ్వరస్వామి, పద్మావతి లాగా, ఆదర్శ దంపతులుగా రామాలయంలో పూజలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. సోమువీర్రాజు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. 

 పది మందిని వెంటబెట్టుకుని అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదన్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చిన బీజేపీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్ కు సలహాలు ఇచ్చే స్థాయి రాష్ట్ర బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. 

 

Leave a Comment