ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-ప్యాక్ సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి విరామం తీసుకునే సమయం వచ్చిందన్నారు. 

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడం ఖాయమైన నేపథ్యంలో జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగాలని అనుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు తగినంత చేశానని, విరామం తీసుకొని జీవితంలో ఇంకేదైనా చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇక పూర్తిగా వీటిని వదిలేయాలనుకుంటున్నట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. 

తాను ఓ విఫల రాజకీయ నాయకుడినని, భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై ఆలోచించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తోన్న ఐపాక్ ను కొనసాగించడానికి సమర్థ నాయకత్వం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరుపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఎన్నికల షెడ్యూల్ నుంచి, మతపర ప్రచారం దాకా బీజేపీని అనుమతించిందని, వారి కోసం రూల్స్ ను సడలించారని పేర్కొన్నారు. కాషాయపార్టీకి అనుకూలంగా చేయాల్సిందంతా చేసిందని, టీఎంసీ ప్రచారాన్ని సంక్లిష్టం చేస్తూ పక్షపాత వైఖరిని అవలంబించిందని ఆరోపించారు. అయినా బెంగాల్ ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారని పేర్కొన్నారు. 

Leave a Comment