రాజప్రాసాదం వీడి.. సీఎం జగన్ జనంలోకి రావాలి : ఉమా

     కరోనా వ్యాప్తిలో రాష్ట్రం త్వరలో ఢిల్లీని దాటిపోతుందని, కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నట్లుగా లేవన్న ఉమా,  ప్రజలు మాస్కు ధరించేలా వారిలో అవగాహాన కల్పించడం కూడా ఈ ప్రభుత్వం చేతగావడం లేదని విమర్శించారు. 

వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా, ముఖ్యమంత్రి కరోనాను ప్రధాన అజెండాగా ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఆయన చేస్తున్న సమీక్షలు తాడేపల్లి రాజప్రాసాదం గడప దాటడం లేదన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లోని ఆహారం అధ్వాన్నంగా ఉన్నా, పట్టించుకోవడం లేదన్నారు. లక్ష కేసుల్లో 50వేల యాక్టివ్ కేసులుంటే, అందుకు తగిన విధంగా ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు ఉన్నాయో లేదో, ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కరోజైనా సమీక్ష చేశారా అని దేవినేని ప్రశ్నించారు. ఎంతమంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు…  ఎంతమంది రోగులకు వైద్యం అందుతోందనే వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు.

 ప్రజలకు మానసిక ధైర్యం కల్పించేందుకు బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేస్తున్నపనిని, ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోతు న్నాడో చెప్పాలన్నారు. జగన్ మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నాడన్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.8వేల కోట్లు, ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1000కోట్లు దేనికి ఖర్చు చేశారో  సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

వైసీపీ నేతలు ప్రచారార్భాటంతో నేషనల్ పర్మిట్ లారీల్లా విచ్చలవిడిగా తిరిగి రాష్ట్రంలో కరోనా వ్యాపింపచేసి, పక్క రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు.  వైసీపీ నేతలు పొందుతున్న కార్పొరేట్ వైద్యమే రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి అందించాలన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పడు నీతి అయోగ్ కు పంపిస్తుంటే, ముఖ్యమంత్రి కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదన్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు మూసేసిన ప్రభుత్వం, జేట్యాక్స్ కోసం రాత్రి 9 గంటలవరకు విక్రయాలు జరపడం దుర్మార్గం కాదా అని ఉమా మండిపడ్డారు. 

అమరావతి రైతులకు వ్యతిరేకంగా, రాజధాని తరలింపుకోసం ఏ లాయర్లను పెట్టాలి.. ఆగస్ట్ 15 నాటికి విశాఖకు ఎలా తరలి వెళ్లాలన్నా దానిపై పెట్టిన శ్రద్ధ, ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంపై పెట్టడం లేదన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Leave a Comment