ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ ప్రసవం.. అందరికీ ఆదర్శం అంటూ ప్రశంసలు..!

ప్రస్తతం చాలా మంది ఏ చిన్ని జబ్బు చేసినా వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారే కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. ఇక ప్రభుత్వం ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఆస్పత్రుల ముఖం కూడా చూడరు. వారు మంచి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారే ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ సూళ్ల వైపు చూస్తున్నారు.

కానీ ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత మాత్రం అందుకు భిన్నంగా చేశారు. తనకు పురిటి నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా సామాన్య మహిళ లాగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. డెలివరీ సమయం అని డాక్టర్లు చెప్పడంతో అక్కడే డెలివరీ చేయించుకున్నారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకున్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.. దీంతో సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.   

Leave a Comment