అమెజాన్ లో రూ.70 వేల ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. సబ్బు..రూ.5 నాణెం వచ్చాయి..!

ఇది వరకు ఏం కావాలన్నా మార్కెట్ కి లేదా షాపుకు వెళ్లి కొనేవాళ్లు.. కానీ రోజులు మారాయి. అంతా ఇంటర్నెట్ మయం.. ఏం కావాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి.. ఈకామర్స్ సంస్థలు కూడా యూజర్స్ ను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే వస్తువులకు బదులు ఇటుకలు, సబ్బులు ప్యాకుల్లో వస్తున్నాయి. ఇటీవల ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు వచ్చిన సంగతి తెలిసిందే.. 

తాజాగా అమెజాన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అనే వ్యక్తి రూ.70,900ల ఖరీదైన ఐఫోన్ 12 అమెజాన్ లో అక్టోబర్ 12న ఆర్డర్ చేశాడు. దీని బిల్లును అమెజాన్ పే కార్డ్ ద్వారా చెల్లించాడు. అక్టోబర్ 15న నూరుల్ కు ఆర్డర్ వచ్చింది. కొత్త ఐఫోన్ వచ్చిందన్న ఉత్సాహంతో ఆర్డర్ ప్యాక్ ను తెరిచి చూశాడు. అంతే అందులో ఉన్న వస్తువులను చూసి షాక్ అయ్యాడు.. 

ఆర్డర్ ప్యాక్ లోపల డిష్ వాష్ సోప్, 5 రూపాయల కాయిన్ ఉన్నాయట. దీంతో నూరుల్ వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ పోలీసులు అమెజాన్ అధికారులను సంప్రదించగా.. సెప్టెంబర్ 25 నుంచి జార్ఖండ్ లో ఓ వ్యక్తి ఈ ఫోన్ వినియోగిస్తున్నాడనే వాస్తవం బయటపడింది. నూరుల్ అక్టోబర్ లో ఈ ఫోన్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే అప్పటి స్టాక్ అయిపోయిందని, అతడు చెల్లించిన డబ్బులు తిరిగి ఇస్తామని అమెజాన్ అధికారులు వెల్లడించారు. తనకు ఎదురైన అనుభవాన్ని నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వెంటనే అది వైరల్ అయింది. ఐఫోన్ కు బదులు ఆకుపచ్చ రంగు అంట్లు తోమే సబ్బు, 5 రూపాయల కాయిన్ కనిపించే ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మీరు కూడా ఇలాంటి ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి..  

 

Leave a Comment