భర్త వదిలేస్తే.. నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్ముతూ నేడు ఎస్సైగా మహిళ..!

ఓ యువతి 18 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మోజు తీరాక భర్త వదిలేసి పోయాడు. పుట్టింటికి వెళ్తే తమ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుందని రానివ్వలేదు. పొట్టకూటి కోసం వీధుల్లో నిమ్మరసం, ఐస్ క్రీమ్ లు అమ్మింది. పట్టుదలతో ఆపేసిన చదువును పూర్తి చేసి నేడు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించింది. ఇది కేరళకు చెందిన అని శివ అనే 31 ఏళ్ల మహిళ విజయగాథ..

కేరళకు చెందిన అని శివ 18 ఏళ్ల వయస్సులో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న సమయంలో ఒకరిని ప్రేమించింది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా అతడిని పెళ్లిచేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను బహిష్కరించారు. ఆమె వైవాహిక జీవితం కూడా సవ్యంగా సాగలేదు. బిడ్డ పుట్టిన ఆరు నెలలకు భర్త ఆమెను వదిలేశాడు. దీంతో తన నానమ్మకు సంబంధించిన చిన్ని రేకుల షెడ్డులో బిడ్డతో కలిసి జీవించసాగింది. 

 బతుకుతెరువు కోసం వర్కాలా శివగిరి ఆశ్రమ ప్రాంతంలో నిమ్మ రసం, ఐస్ క్రీములు అమ్మడం, హస్తకళా వస్తవుల అమ్మకం వంటి చిన్న చిన్న వ్యాపారలు చేయడానికి ప్రయత్నించినా ఏదీ కలిసిరాలేదు. ఇదిలా ఉండగా ఓసారి ఆమెను గమనించిన ఓ వ్యక్తి చదువు పూర్తి చేసి ఎస్సై పరీక్ష రాయమని సలహా ఇచ్చాడు. దానికి ఆర్థిక సాయం కూడా చేశాడు. ఆ వ్యక్తి సలహా మేరకు ఆమె ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగం సంపాదించింది. 

తన గురించి తెలిసి చాలా మంది ప్రశంసిస్తూ మెసేజ్ లు చేస్తున్నారని అని శివ పేర్కొంది. వర్కాలా పోలీస్ స్టేషన్ లో తనకు పోస్టింగ్ ఇచ్చారని కొన్ని రోజుల క్రితమే తెలిసిందని తెలిపింది. ఎక్కడైతే తాను కన్నీరు పెట్టుకున్నానో అక్కడే ఎస్సైగా విధులు నిర్వహిస్తానని తలుచుకుంటే చాలా గర్వంగా ఉందని అని పేర్కొందిి.  

 

 

Leave a Comment