టెన్షన్ టెన్షన్.. అక్కడ మరో కొత్త వైరస్

ఇప్పటికే కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుండగా కేరళలో కొత్తగా మరో వైరస్ బయటపడటం కలకలం రేగుతోంది. కేరళలో అరుదైన నోరో వైరస్‌ కేసులు నిర్ధారణయ్యాయి. వయనాడ్‌ జిల్లా పోకోడ్‌లోని ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరో వైరస్ బారిన పడ్డారు. కాలేజీ బయట, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో తొలుత ఈ వైరస్‌ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల రక్త నమూనాలను అలప్పుజాలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపి పరీక్షించగా పలువురిలో పాజిటివ్ వచ్చింది.

చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. నోరో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత వెటర్నరీ కాలేజీ విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి ప్రత్యేక అవగాహన తరగతిని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అధికారులతో సమావేశమై వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బాధితులకు తగిన చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు. జంతువుల్లో పుట్టే ఈ వైరస్ నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు.

ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. నీటిని ఎక్కువగా క్లోరినేషన్ చేయడం సహా నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. తగిన చికిత్స, నివారణ ద్వారా నోరో వైరస్‌ను నియంత్రించవచ్చని, దీని గురించి ప్రతి ఒక్కళ్లూ అవగాహన పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. వైరస్ సోకినవారు తగినంత విశ్రాంతి తీసుకుని, ఓఆర్ఎస్ ద్రావణం, కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని తెలిపారు.

మరోవైపు చూస్తే దేశ వ్యాప్తంగా నిన్న 12,516 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. యాక్టివ్ కేసులు 267 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు.

నిన్న క‌రోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,62,690కి పెరిగింది. నిన్న‌ 53,81,889 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు వాడారు. నిన్న‌ 11,65,286 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

 

Leave a Comment