రూ.2 లక్షలు జీతం.. రూ.30 వేలకు కక్కుర్తిపడి బుక్కయ్యాడు..!

విద్యుత్ శాఖలో మంచి హోదా.. నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా 30 వేల రూపాయలకు కక్కుర్తి పడ్డాడు ఓ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ).. చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుక్కయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. 

వివరాల మేరకు ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్ లో చరణ్ సింగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్, నార్సింగ్, శంకర్ పల్లి, ఇబ్రహీంబాగ్ డివిజన్లలో పనులను చరణ్ సింగ్ పర్యవేక్షిస్తాడు. ఇటీవల మణికొండలో విద్యుత్ తీగలను మార్చడం, కొత్త ట్రాన్స్ ఫార్మర్లు అమర్చే పనుల టెండర్ ను గుత్తేదారు రవి దక్కించుకున్నాడు. 

టెండర్ దక్కించుకున్న అనంతరం అనుమతి పత్రాలు ఇచ్చేందుకు ఏడీఈ చరణ్ సింగ్ లంచం అడిగాడు. దీంతో రవి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. వారి సూచించిన విధంగా శుక్రవారం మధ్యాహ్నం గుత్తేదారు రవి రూ.30 వేల తీసుకుని ఏడీఈ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ చరణ్ సింగ్ లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అనిశా అధికారులు పట్టుకున్నారు. విచారణ తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చరణ్ సింగ్ ను జైలుకు తరలించారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వారు ఎదురైతే వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించండి… 

Leave a Comment