బిపిన్ రావత్ మరణం.. ఇస్లాం వదిలి.. హిందూ మతంలోకి కేరళ సినీ దర్శకుడు..!

కేరళ సినీ దర్శకుడు అలీ అక్బర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాం మతం వదిలి హిందూ మతం స్వీకరించాలని నిర్ణయించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతిపై కొందరు స్పందించిన తీరుకు బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. జనరల్ బిపిన్ రావత్ మరణ వార్తకు సోషల్ మీడియాలో కొందరు నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

బిపిన్ రావత్ చనిపోయినప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఎమోజీలు పోస్ట్ చేసిన వారిలో ముస్లింలే ఎక్కువగా ఉన్నారని, మతమే అన్నిటికంటే ప్రాధాన్యమనుకుని ఎలా జీవించగలమని ఆయన అన్నారు. ఇకపై తాను ముస్లింను కాదని, ఇండియన్ మాత్రమే అంటూ అక్బర్ చెప్పారు. భారత్ కు వ్యతిరేకంగా నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసిన వారికి ఇదే నా సమాధానమని అన్నారు. 

కాగా అలీ అక్బర్ తన పేరును రామ సింహన్ అని పెట్టుకోవాలని నిర్ణయించారు. ఆయనతో పాటు తన భార్య కూడా ఇస్లాం మతాన్ని వదిలివేస్తున్నట్లు అక్బర్ చెప్పారు. అయితే తన పిల్లలు మేజర్లు కాబట్టి వారికి నచ్చిన మతాన్ని వారు ఎంచుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం దర్శకులు అలీ అక్బర్ మతం మారడం కేరళలో చర్చనీయాంశంగా మారింది.   

 

Leave a Comment