ఎన్నికల్లో వాలంటీర్లను దూరం పెట్టండి : నిమ్మగడ్డ

గ్రామపంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లను వినయోగించరాదని, వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. ఏసీ సీఎస్, డీజీపీ, 13 జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను పాదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించుకోవాలని సూచించారు. 

అంకితభావంతో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని నిమ్మగడ్డ పిలపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహశీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీలో అలసత్వం వహించకూడదని, అలాంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు సజావుగా సాగేలాగా సహకరించాలన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫేజ్-1లో జరగాల్సిన ఎన్నికలు చివరి విడత నిర్వహిస్తామన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించే ఆలోచనలో కమిషన్ ఉందన్నారు. అందులో భాగంగా ప్రత్యేక యాప్ ద్వారా ఓటింగ్ ప్రక్రియపై, పోలింగ్ బూత్ బయట, లోపల జరిగే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు.

 వాటికి సంబంధించి వీడియో క్లిప్పింగులను, ఫొటోలను ఎలక్షన్ కమిషన్ రూపొందించిన యాప్ ద్వారా అప్ లోడ్ చేయవచ్చన్నారు. వీటిని పరిశీలించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వీటికి సంబంధించిన ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధింత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Leave a Comment