ఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!

ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెరువులో దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు.. తల్లికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేతా చౌదరి(22) బీటెక్ పూర్తి చేసి.. కొన్ని నెలలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. 

ఈక్రమంలో హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. శనివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి స్కూటీపై వెళ్లి శ్వేతా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చెరువు వద్ద ఆగింది.. అక్కడి నుంచి ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ.. డాడీ ఐ లవ్ యూ’ అంటూ ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టింది..ఆ తర్వత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

శ్వేత ఆన్ లైన్ లో డబ్బులు పెట్టి మోసపోయినట్టు బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు. కొన్ని రోజుల కింద ఆమెకు ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తి రూ.1.2 లక్షలు చెల్లిస్తే దాదాపు రూ.7 లక్షలు వస్తాయని నమ్మించాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పింది. ఆ వ్యక్తి శ్వేత ఖాతాకు రూ.50 వేలు పంపాడు. మిగిలిన మొత్తం కలిపి తాను చెప్పిన ఖాతాకు పంపాలని చెప్పాడు. దశల వారీగా మరో రూ.1.3 లక్షలు కట్టించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి శ్వేత ఫోన్ ఎత్తడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక శ్వేత ఆత్మహత్య చేసుకుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Leave a Comment