ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా?.. ఆ గడియారం ఏం చెబుతోంది?

ప్రపంచం అంతయ్యే రోజు దగ్గర్లోనే ఉందా? అవుననే చెబుతున్నారు. నిపుణులు.. ఇందుకు కారణం ‘డూమ్స్ డే క్లాక్’(Doomsday Clock) లోని సమయం… అర్ధరాత్రికి కేవలం మరో 100 సెకన్ల దూరంలో ఉంది. దీంతో ప్రపంచం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదంటూ ‘డూమ్స్ డే క్లాక్’ క్లాక్ హెచ్చరిక జారీ చేసింది. 

కరోనా వైరస్ మహమ్మారి, అణు యుద్ధం, పర్యావరణంలో మార్పులతో ‘డూమ్స్ డే క్లాక్’ అర్ధరాత్రికి మరింత చేరువైంది. గతంలో ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని అటామిక్ సైంటిస్ట్ బులెటిన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ పేర్కొన్నారు. సైన్స్ పై విశ్వాసం లేకపోవడం, కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. కాగా గతేడాది అర్ధరాత్రికి 2 నిమిషాల దూరంలో ఉన్న ఈ గడియారం ఇప్పుడు 100 సెకన్లకు చేరింది.

‘డూమ్స్ డే క్లాక్’ అంటే ఏంటీ?

‘డూమ్స్ డే క్లాక్’ ను 1947లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిసి స్థాపించిన బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అభివృద్ధి చేసింది. ప్రపంచం అంతమవడానికి ఎంత దగ్గరలో ఉన్నామో చెప్పడానికి ఈ గడియారాన్ని రూపొందించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పుల ఆధారంగా 13 మంది నోబెల్ గ్రహీతలతో సహా శాస్త్రవేత్తల బృందం ఈ గడియారాన్ని సవరిస్తూ ఉంటుంది. మొదట్లో అప్పటి పరిస్థితులను బట్టి ఈ గడియారాన్ని అర్ధరాత్రి 7 నిమిషాల దూరంలో సెట్ చేశారు. ఆ తర్వాత 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత దీనిని 17 నిమిషాలకు సవరించారు. 

ప్రపంచం అణ్వాయుధాలతో అంతమవుతుందని, అందుకే అణ్వాయుధాలు లేకుండా చేయాలని అటామిక్ సైంటిస్ట్ లోని సభ్యులు పిలుపునిస్తున్నారు. రష్యా కొత్త అణు ఒప్పందాన్ని ప్రారంభించడంతో పాటు ఇరాన్ తో మళ్లీ అణు ఒప్పందంలోకి అమెరికా రావాలని వీళ్లు సూచిస్తున్నారు. అంతే కాదు కర్బన ఉద్గారాలను నిర్మూలించడానికి అమెరికా, చైనా, ఇతర పెద్ద దేశాలు కలిసి రావాలని సూచించారు. 

 

Leave a Comment