కరోనా కట్టడిలో మోడీ సర్కార్ విఫలమైంది.. ఎండగట్టిన అంతర్జాతీయ మీడియా..!

భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటి వరకు కరోనా కరోనా అత్యధిక కేసులు నమోదైన దేశాలు అమెరికా, బ్రెజిల్ ను భారత్ దాటేసింది. ఈక్రమంలో అనేక దేశీయ మీడియా సంస్థలు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ మీడియా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంపై వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తున్నాయి.

ముఖ్యంగా వైరస్ మ్యూటేషన్ ను ముందుగా అంచనాలేసి నియంత్రించడంలో భారత్ వైఫల్యం చెందిందంటూ దుయ్యబెడుతున్నాయి. కరోనా కట్టడి కంటే బెంగాల్ కుర్చీ దక్కించుకోవడమే పరమావధిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా ర్యాలీలు చేపట్టిందని పేర్కొన్నాయి. దీనికి తోడు కుంభమేళాకు అనుమతివ్వడం మోడీ సర్కార్ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా పత్రికల్లో ప్రచురించాయి. ప్రముఖ వార్తా సంస్థలన్నీ కుంభమేళాను కవరేజ్ చేస్తూ కథనాలు రాశాయి. ఎక్కువ మంది స్వాములు, ప్రజలు మాస్కులు లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఫొటోలతో వార్తలిచ్చాయి. 

ఏయే మీడియా సంస్థలు ఏమని పేర్కొన్నాయంటే..

  • అతి పెద్దదైన రెండో వేవ్ లో మోడీ కొట్టుమిట్టాడుతున్నాడు.. గత కొన్ని రోజులుగా భారత్ లో రోజువారి కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 3 లక్షలు దాటడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. వేగవంతమైన రెండో తరంగాన్ని ముందుగా గుర్తించి నియంత్రణా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. తొలి తరంగం ప్రభావం నుంచి ప్రభుత్వం గుణపాఠాం నేర్చుకోకపోవడం విడ్డూరం. ఈ సంక్షోభానికి బాధ్యత ప్రభుత్వానిదే. – ‘ది టైమ్స్’
  • భారత్ లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. భారత్ కోవిడ్ నరకంలో కూరుకుపోయింది. కోవిడ్ ను భారత్ జయించిందని కొందరు తప్పుగా విశ్వసించారు. కానీ ప్రస్తుతం అక్కడి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదు. మృతదేహాలు కుప్పలుగా పేర్చుతున్నారు. – ‘ది గార్డియన్’
  • భారత్ లో ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. ప్రతి చోట విషాధ చాయలున్నాయి. తొలి తరంగంతో పోలిస్తే ఈ సారి కోవిడ్ తీవ్రత, నష్టాలు అధికంగా ఉన్నాయి. కరోనా కాలం ముగిసిపోయిందంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కరోనా పెరిగిపోయింది. – ఫైనాన్సియల్ టైమ్స్’
  • భారత్ లో స్మశానాలు 24 గంటలు తెరిచే ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఆంక్షల సడలింపు, వైరస్ ల మధ్య వైరుధ్యం నెలకొంది. టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. – ‘వాషింగ్టన్ పోస్ట్’
  • వైరస్ ల మ్యూటేషన్ ను గుర్తించడంలో భారత్ విఫలమైంది. ప్రస్తుతం కరోనా వైరస్ లో వివిధ వేరియంట్ల పుట్టక, అభివృద్ధికి భారత్ కేంద్రంగా మారింది. – ‘వాల్ స్ట్రీట్ జర్నల్’

 

 

Leave a Comment