షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలు

 అమరావతి : రాష్ట్రంలో ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా  ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించామన్నారు. 

రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు .. 

కాగా విద్యాశాఖ పరిధిలోకి వచ్చే ప్రైవేటు యూనివర్శిటీలు, డిమ్డ్‌ యునివర్శిటీలతో పాటు కోచింగ్‌ సెంటర్లు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ అవసరమనుకుంటే విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా క్లాస్‌లు తీసుకునే అనుమతి ఉన్నట్లు తెలిపారు. ఇక షెడ్యూల్‌ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జలుబు దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. హాస్టల్‌ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసి అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని మంత్రి పేర్కొన్నారు.

 

Leave a Comment