జే ట్యాక్స్ కు భయపడే..!

రాష్ట్రం నుంచి ఐటీ పరిశ్రమలు తరలివెళ్తున్నాయి..

బుద్ధా వెంకన్న

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆయా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  చంద్రబాబు నాయుడును చూసే రాష్ట్రానికి కియా పరిశ్రమ వచ్చిందన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జే ట్యాక్స్ పేరుతో ఐటీ కంపెనీలను బెదిరిస్తున్నారన్నారు. జగన్ తన స్వార్థం కోసం ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్మించిన వంద అంతస్తుల భవనాన్ని నేడు జగన్ తేలికగా కూల్చేస్తున్నారన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో లక్ష కోట్ల విలువైన పెట్టుబడులు తరలివెళ్లాయన్నారు. అంతర్జాతీయ బ్యాంకుల రుణాలు వెనక్కి వెళ్లాయని, సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల 50వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయామని అన్నారు. రాష్ట్రంలో లక్షా 80వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయన్నారు. దీనిద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. కియా పరిశ్రమ ద్వారా 12వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. నేడు జగన్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. అదానీ 70వేల కోట్లు, లులు 2200 కోట్లు, రిలయన్స్ 15వేల కోట్లు, ఒంగోలులో ఏపీపీ పేపర్ మిల్లు 20వేల కోట్లు, బీఆర్ శెట్టి 12వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోయాయన్నారు. జగన్ కు దోచుకోవడం దాచుకోవడం తప్ప.. పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలు చేతకావని విమర్శించారు. విజయవాడ రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా పడిపోయాయన్నారు. పెట్టుబడిదారులకు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేయాలి కానీ.. జగన్ కు బౌన్సర్ గా పనిచేస్తున్నారని,  అందరినీ జైలుకు పంపి శ్మశానాన్ని ఏలుకొంటారా అని ప్రశ్నించారు. 

Leave a Comment