దేశ రాజధానిలో ఉద్రిక్తత..!

రెండు వర్గాల మధ్య ఘర్షణ

రాళ్లతో దాడి

దేశ రాజధానిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్ల దాడి జరిగింది. దీంతో రాజధాని మరోసారి భగ్గుమంది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తోన్న ఆందోళనకారులపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిరసనకారులపై రాళ్లు రువ్వారు. దీనికి ప్రతిగా నిరసనకారులు కూడా రాళ్లు రువ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఢిల్లీలోని జఫ్రాబాద్ సమీపంలోని మౌజ్ పూర్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 

delhi1

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు తరచూ జఫ్రాబాద్, మౌజ్ పూర్, షహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జఫ్రాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ సముదాయం కింద శనివారం అర్ధరాత్రి నుంచి 500 మందికి పైగా ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుంచి ప్రయత్నించారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనకారులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. తమపై రాళ్లు రువ్వినవారిపై ఆందోళనకారులు కూడా దాడికి దిగారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మరో వర్గం వారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం ఆందోళనకారులు చెల్లాచెదురు అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మరిన్ని పోలీసు బలగాలను మౌజ్ పూర్ ప్రాంతానికి తరలించారు. 

అదుపులో పరిస్థితులు..

రాళ్ల దాటి చోటు చేసుకున్న విషయాన్ని ఢిల్లీ తూర్పు ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే తాము అదనపు పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పంపించామని అన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని చెప్పారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. హింసాత్తమక వాతావరణానికి దిగిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.                                                                                                                

Leave a Comment