ప్రభుత్వానికి ఆదాయం ఆగిపోయింది : సజ్జల

అమరావతి : ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి ఆదాయం అంతా ఆగిపోయిందని, ఉద్యోగసంఘాల నేతలతో సీఎం జగన్ చర్చించారని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో పరిస్థితిని వివరించామని, జీతాలు రెండు విడతలుగా చెల్లిస్తామని సీఎం చెప్పారని, వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. 

ఇప్పటివరకు కోటి 28 లక్షల ఇళ్లలో సర్వే చేయించామని, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నామని తెలిపారు. వారికి డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్లకు, ఆస్పత్రులకు తరలిస్తున్నారని చెప్పారు. జమాత్ కు వెళ్లివచ్చిన వారిని గుర్తించామని, వారందరికి వైద్యపరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. వైరస్ సోకిన వాళ్లు స్వచ్ఛందంగా వైద్యపరీక్షలకు ముందుకు రావాలన్నారు. 

రాష్ట్రానికి ఆర్థిక భారం..

కరోనా వల్ల రాష్ట్రానికి అదనపు ఆర్దిక భారం పడిందని, ఈ అంశాన్ని సైతం రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కరోనా వంటి విపత్తు నేపధ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. చంద్రబాబు ఏస్థితిలో రాష్ట్ర ఖజనాను సీఎం జగన్ కి అప్పచెప్పారని ప్రపంచానికి తెలుసన్నారు. ఎన్నికలకు ముందు అందరికి పంచేసి ఖాళీ ఖజానాను నూతన ప్రభుత్వానికి అప్పగించారన్నారు.

ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించాం..

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాష్ట్ర ఆర్థకి పరిస్థితి గురించి సీఎం జగన్ వివరించారన్నారు. ఈ ప్రభుత్వం కరోనా నేపధ్యంలో బిపిఎల్ కింద ఉన్న రేషన్ కార్డు హోల్టర్స్ కు వేయి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ధాన్యం బకాయిలు కూడా చెల్లించారన్నారు. చంద్రబాబు, టిడిపి నేతలూ చౌకబారు ఆరోపణలతో మీరేమి సాధించలేరని హితవు పలికారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న పోలీసు, వైద్య, పారిశుధ్య, వాలంటీర్లు, ఆశావర్కర్లు ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

Leave a Comment