భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన కట్టుకున్న భర్త..!

భర్తతో గొడవపడిన ఓ భార్య మనస్తాపంతో కళ్లముందే ఉరి వేసుకుంటుంటే ఆపాల్సిన భర్త ప్రోత్సహించి ఆమె మృతికి కారణమయ్యాడు. ఉరితాడు బిగించుకుని విలవిల్లాడుతుంటే ఆపే ప్రయత్నం చేయకుండా తన ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. 

వివరాలు మేరకు ఆత్మకూరు పట్టణానికి చెందిన పెంచలయ్య ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 ఏళ్ల వయసున్న రెండో కుమారుడు తరుణ్ గుండె జబ్బుతో బాధపడుతున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొండమ్మపై అనుమానంతో పెంచలయ్య నిత్యం వేధించేవాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలంటే నీ ముందే ఉరి వేసుకుని చస్తానని కొండమ్మ చెప్పింది. ఆమె అంతచెప్పినా పెంచలయ్య ఏమాత్రం చలించలేదు. పైగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని, నువ్వు చస్తేనే సమస్యలు తీరుతాయని మరింత రెచ్చగొట్టాడు. 

దీంతో మనస్తాపం చెందిన కొండమ్మ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుంటూ ఉండగా ఆపే ప్రయత్నం చేయలేదు. ఉరికి వేళాడుతూ బాధతో గిలిగిలా కొట్టుకుంటున్నా ఆ దృశ్యాలను ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపాడు. పెంచలయ్య తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహంతో పోలీసులకు సమచారం ఇచ్చారు. స్థానికులు గమనించి కొండమ్మను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొండమ్మ తుదిశ్వాస విడిచింది. భార్య కొండమ్మ ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో తీసి పైశాచిక ఆనందం పొందిన పెంచలయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 

Leave a Comment