టిఫిన్, లంచ్, డిన్నర్ మ్యాగీనే.. విసిగిపోయి భార్యకు విడాకులు..!

ఓ వ్యక్తి భార్యకు మ్యాగీ నూడుల్స్ వండటం తప్ప ఇంకేమీ చేయడం రాదు. భర్తకు టిఫిన్, లంచ్, డిన్నర్ మూడు పూటల మ్యాగీని తినాల్సి వచ్చేది. మూడు పూటల నూడుల్స్ తినలేక విసిగిపోయిన భర్త తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మైసూర్ లోని డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్డు ప్రధాన న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ తాను బళ్లారి జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికరమైన కేసు గురించి మీడియా సమావేశంలో గుర్తు చేసుకున్నారు. 

‘ఓ వ్యక్తి భార్యకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కేవలం నూడుల్స్ వండటమే వచ్చు. ఇది తప్ప ఇంకేమీ రాదు. ఆ భార్య షాప్ కి వెళ్తే కేవలం ఇన్ స్టంట్ నూడుల్స్ మాత్రమే కొంటుంది. మూడు పూటల అదే వండేది. మూడు పూటలు నూడుల్స్ తినలేక భర్తకు విసుగెత్తేది. దీంతో ఆ భర్త విడాకులు కోరాడు’ అని న్యాయమూర్తి రఘునాథ్ చెప్పారు. పరస్పర అంగీకారంతోనే ఇద్దరు విడాకులు తీసుకున్నారన్నారు. ఈ విడాకుల కేసును ‘మ్యాగీ కేసు’గా ఆయన అభివర్ణించారు. 

ఈరోజుల్లో చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారన్నారు. ప్లేట్ లో ఉప్పు తక్కువైందని, పెళ్లికి తగిన కలర్ డ్రెస్ తీసుకురాలేదని చాలా చిన్న కారణాలతో విడాకులు కోరుతున్నారన్నారు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయన్నారు. ఒక వ్యక్తిని పాము కాటేసిందని, ఇందులో భార్య తప్పు లేకపోయినా దానికి ఆమే కారణమని విడాకులు కోరిన కేసులు ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. 

Leave a Comment