ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా పొందండి రూ.50 వేల నుంచి రూ.10 లక్షలు రుణం..

మీరు ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించారా? మీ వద్ద వ్యాపార నిర్వహణకు సరిపడ నిధులు లేవా? అయితే దీని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ -4 గురించి ఆయన ఇచ్చిన ప్రసంగంలో కూడా MSME కోసం ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించారు. MSME ల కోసం రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

 స్వయం ఉపాధి కోసం నిధులు లేక ఇబ్బందులు పడే వారికి ప్రధాని నరేంద్ర మోడీ 2015లోనే ‘Mudra’ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని గురించి చాలా మందికి తెలియదు. మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ(Mudra) అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY) పరిధిలోకి వచ్చే పథకం. ప్రధాన మంత్రి ముద్ర యోజన సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 

Mudra యోజన పథకం కింద చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రూ.10 లక్షల వరు రుణం అందజేస్తారు. ప్రధాన మంత్రి ముద్ర యోజనకు రూ.20,000 కోట్ల కార్పస్ నిధి ఉంటుంది. బ్యాంకులకు గ్యారంటీగా ఉండటానికి ఈ మూలధనాన్ని ప్రభుత్వం కేటాయించింది. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఆర్బీఐలు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎంఎస్ఐలు, ఎన్బీఎఫ్సీలను సంప్రదించడం ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ పథకానికి అర్హతలు ఏమిటి, లబ్ధిదారులు ఎలా ప్రయోజనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Mudra రుణాల రకాలు..

Mudra పథకం ద్వరా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ముద్ర లోన్ పథకం ద్వారా మూడు రకాల రుణాలను అందజేస్తారు. శిశు, కిషోర్ మరియు తరుణ్ అనే మూడు రకాల రుణాలను ముద్ర అందజేస్తుంది.

శిశు –  ఈ పథకం కింద రూ.50,000 వరకు రుణం అందజేస్తారు. ఈ రుణం తక్కువ నిధులు అవసరమయ్యే వారి కోసం ఉద్దేశించబడింది. ఇది కొత్తగా ప్రారంభించే లేదా ప్రారంభించిన వారికి నిధులు అవసరమయ్యే వారికి ఇవ్వబడుతుంది. 

కిషోర్ – ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ఈ రకమైన రుణం ఇప్పటికే తమ వ్యాపారాన్ని ప్రారంభించిన దరఖాస్తుదారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించిన వారికి కొంత మేర డబ్బులు అవసరమవుతాయి. వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు నిధులను ఇచ్చే సంస్థలపై ఆధారపడి ఉంటుంది. 

తరుణ్ – ఈ పథకం కింద దరఖాస్తుదారుడు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాపారాలు ప్రారంభించిన వారికి ఫైనాన్స్ సపోర్ట్ కోసం అందించబడుతుంది. 

రుణం చెల్లించే కాలం..

ముద్ర రుణాలను లబ్ధిదారులు ఐదు సంవత్సరాలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మొత్తం రుణాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించాలి. వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాయిదాలను చెల్లించడం కష్టం కాదు. 

రుణాలు పొందేందుకు అర్హతలు..

  • లబ్ధిదారుడు భారత పౌరుడు అయి ఉండాలి. 
  • వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి. ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవారంగంలో..
  • రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి. 
  • పై అర్హతలు ఉంటే వారు బ్యాంక్, సూక్ష్మ రుణ సంస్థ(ఎంఎఫ్ఐ) లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) అధికారులను సంప్రదించాలి.

Mudra రుణం పొందగల రంగాలు..

  • సేవా రంగ సంస్థలు
  • సూక్ష్మ పరిశ్రమలు
  • దకాణాల నిర్వహించే వారు
  • వాహనాల కొనుగోలు కోసం
  • ఆహార ఉత్పత్తి సంస్థలు
  • విక్రేతలు(పండ్లు మరియు కూరగాయలు)
  • సూక్ష్మ తయారీ సంస్థలు

Mudra రుణం కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన పత్రాలు

  • గుర్తింపు కార్డు – ఓటర్ ఐడీ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్ పోర్ట్.
  • రెసిడెన్స్ ప్రూఫ్ – విద్యుత్ బిల్లు / ఆస్తి పన్ను రసీదు/ ఓటర్ ఐడీ కార్డు/ పాస్ పోర్టు తదితర..
  • యంత్రాలు మరియు ఇతర వస్తువుల కొటేషన్లు
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
  • వ్యాపార సంస్థలకు సంబంధించిన లైసెన్స్
  • వ్యాపార చిరునామ యొక్క రుజువు
  • కుల ధ్రువీకరణ పత్రాలు.

Mudra లోన్ దరఖాస్తు చేయడం ఎలా?

  • దరఖాస్తుదారులు తమ సమీప వాణిజ్య లేదా ప్రైవేటు బ్యాంకును సందర్శించాలి.
  • వ్యాపార ప్రణాళికను తెలియజేయాలి.
  • సరిగా నింపిన రుణ దరఖాస్తు ఫారంను సమర్పించాలి.
  • కావలసిన అన్ని ప్రతాలను సమర్పించాలి. 
  • బ్యాంక్ చేత అన్ని ఇతర ఫార్మాలిటీలు మరియు విధానాలను పూర్తి చేయాలి. 
  • మీ పత్రాలను ధ్రువీకరించి రుణం మంజూరు చేస్తారు. 

 

Leave a Comment