విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు? : సుప్రీం కోర్టు

దేశంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేయడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. మారిన పరిస్థితుల దృష్ట్యా రిజర్వేషన్లపై పరిమితి విధించిన ‘మండల్ తీర్పు’ను పున:సమీక్షించాలని, రిజర్వేషన్ల కోటాలను నిర్దేశించే అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ  వాదించారు. 

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోటా పరిమితిని తొలగిస్తే దాని కారణంగా తలెత్తే అసమానతల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది. చివరగా దాన్ని తామే తేల్చాల్సి ఉంటుందని చెప్పింది. రిజర్వేషన్ల అంశంపై మీ వైఖరి ఏంటని,  ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.  

అయితే మండల్ తీర్పును పున:సమీక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయని, 1931తో పోల్చుకుంటే జనాభా 135 కోట్లకు చేరుకుందని న్యాయవాది రోహత్గీ వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచిందని, రాష్ట్రాలు చాలా సంక్షేమ పథకాలను చేపట్టాయని తెలిపింది. ఏ అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన వర్గాలు ముందుకు సాగలేదని మనం అంగీకరించగలమా అని వ్యాఖ్యానించింది. మండల్ తీర్పును పున:సమీక్షించే ఉద్దేశం వెనుకబాటుతనం నుంచి బయటకు వచ్చిన వారిని నిర్మూలించడమేనని పేర్కొంది. అయితే వెనుకబడిన తరగతులు అనుకున్నంత మేర ముందుకు వెళ్లలేదని రోహత్గీ తన వాదనను వినిపించారు. 

Leave a Comment