అమ్మఒడి రాలేదని అడిగినందుకు..రోడ్డుపై తీసుకొచ్చి విద్యార్థిని కొట్టిన హెచ్ఎం..!

అమ్మఒడి పథకం ఎందుకు రాలేదని అడిగిన విద్యార్థి చెంపను చెల్లుమనిపించారు ఓ ప్రధానోపాధ్యాయుడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ సదరు హెచ్ఎంను సస్పెండ్ చేసింది.

 ఏనుగుతుని గ్రామానికి చెందిన పిల్లా దుర్గారావు కుమారుడు రూపేష్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివి, ఈ ఏడాది నర్సింగబిల్లి హైస్కూల్ లో 9వ తరగతిలో చేరాడు. గత విద్యాసంవత్సరంలో రూపేష్ కు అమ్మఒడి పథకం వర్తించలేదు. దీనిపై పలు మార్లు అడిగినా ఫలితం లేకపోయింది. 

ఈ ఏడాది నర్సింగబిల్లి హైస్కూల్ లో అమ్మఒడి పథకం గురించి హెచ్ఎంను అడగ్గా, ముందు చదివిన పాఠశాలలో హెచ్ఎం అప్ లోడ్ చేశారా? లేదా తెలుసుకొని రావాలని సూచించారు. దీంతో రూపేష్ ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చి అక్కడ హెచ్ఎం డివిఎస్.శర్మను అమ్మఒడి అప్ లోడ్ గురించి అడిగాడు. 

దీంతో కోపోద్రిక్తుడైన హెచ్ఎం శర్మ విచక్షణ మరిచి విద్యార్థి రూరపేష్ చెంప చెల్లుమనిపించారు. అంతటితో ఆగకుండా రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారు. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. దీనిపై హెచ్ఎం శర్మను వివరణ కోరగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా తప్పుపడడంతో రూపేష్ కు అమ్మఒడి వర్తించలేదని తెలిపారు. 

 దీనిపై రూపేష్ మరియు ఆయన తండ్రి తనను తరచూ వేధిస్తున్నారని, అందుకే మందలించాల్సి వచ్చిందని చెప్పారు. దీనిపై డీఈఓ ఆదేశాల మేరకు ఎంఇఒ దివాకర్ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం హెచ్ఎం శర్మను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.   

Leave a Comment