ఢిల్లీలో హైటెన్షన్..!

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణ

13 మంది మృతి, 150 మందికిపైగా గాయాలు..

సరిహద్దులు సీజ్, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లు..

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు మంగళవారం కూడా కొనసాతున్నాయి. ఈ ఘర్షణల్లో 13 మంది మృతి చెందగా, దాదాపు 150 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడిక్కడ ఆంక్షలు విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ జారీ అయ్యాయ. ఈశన్య ఢిల్లీ పరిధిలోని కర్నాల్, నగర్, జాఫ్రాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్ లలో కర్ఫ్యూ విధించారు. కర్వాల్, బాబర్ పూర్ లో 144 సెక్షన్ అమలులో ఉంది. 

సంయమనంతో ఉండాలి – కేజ్రీవాల్

ఈ ఘర్షణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు సంయమనంతో ఉండాలని, శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి పరామర్శించారు. ఆర్మీ బలగాలను రంగంలోకి దింపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే సైన్యాన్ని రంగంలోకి దింపే ఆలోచన లేదని కేంద్ర హోం మంత్రి అమిషా స్పష్టం చేశారు. 

పరీక్షలు వాయిదా…

హింసాత్మక ఘటనల కారణంగా బుధవారం కూడా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అల్లర్లు ప్రభావితమైన ఈశాన్య ఢిల్లీలో రేపు పాఠశాల మూసివేత కొనసాగుతుంది. అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. బోర్డు పరీక్షలు వాయిదా వేయమని సీబీఎస్ఈని కోరాం’ అని ట్విట్ లో పేర్కొన్నారు. సిసోడియా విజ్ఞప్తి మేరకు ఆయా ప్రాంతాల్లో పరీక్షలు వాయిదా వేసినట్లు సీబీఎస్ఈ ప్రతినిధి తెలిపారు. 

 

Leave a Comment