ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు చర్యలు 

 ఎర్ర‌చందనం అధికంగా సాగయ్యే ప్రాంతాల్లో త్వరలో అటవీశాఖ ఖాళీల భర్తీ 

ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సుకు డిఐజి నియామకానికి చర్యలు

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

అమరావతి : రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నివారించేందుకు అటవీ, పోలీస్ తదితర శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయడం ద్వారా స్మగ్లింగ్ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రెడ్ సాండల్ (ఎర్ర‌చందనం) ప్రొటెకక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్ర చందనం స్మగ్లింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎర్ర చందనం సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అటవీశాఖలో గల ఖాళీలను తక్షణం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణకు అటవీశాఖకు ప్రత్యేకంగా ఇంటిలిజెన్స్ వింగ్ ను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి తగిన ప్రతిపాదనలతో రావాలని పిసిసిఎఫ్ ను ఆమె ఆదేశించారు. అదే విధంగా తిరుపతి కేంద్రంగా ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సు టీంనకు ఇన్ స్పెక్టర్  జనరల్ స్థాయి అధికారిని నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న అంశంపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని సిఎస్ నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు సిబ్బందికి ప్రభుత్వ ఉత్వర్వుల సంఖ్య 74 ప్రకారం తగిన నష్ట పరిహారాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటిలిజెన్స్ వ్యవస్థను మరింత అప్ గ్రేడ్ చేసి మెరుగైన రీతిలో ఆ వ్యవస్థ స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణకు తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ 2003 నుండి ఇప్పటి వరకూ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించి 15వేల 940 కేసులు నమోదు  చేసి 14వేల 546 టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే 9వేల 694 వివిధ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 29వేల 235 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అంతేగాక స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనంలో 2005 నుండి 2018 వరకూ 8వేల 179 మెట్రిక్ టన్నులు అమ్మకం,6వేల 822 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేయడం ద్వారా ఇప్పటి వరకూ సుమారు 1700 కోట్ల రూ.లు ఆదాయం సమకూర్చడం జరిగిందని తెలిపారు.

 అంతకు ముందు అటవీ శాఖ విజిలెన్సు వింగ్ అదనపు పిసిసిఎఫ్ ఎకె ఝా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వివరించారు.అదేవిధంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో మొత్తం 913 బేస్ క్యాంపులు ఉండగా వాటిలో 86 ప్రత్యేకంగా ఎర్ర చందనం సాగయ్యే ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. 52 స్ట్రంకింగ్ ఫోర్సులకు గాను 32 ఆప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయని,113 చెక్ పోస్టుల్లో 50 ఆ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నట్టు తెలిపారు. సిబ్బందికి 42 హైరిజల్యూషన్ కెమెరాలను అందించడం జరిగిందని, 2009-10 ఏడాదిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించి 42 మందిని పిడి యాక్టు కింద అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.

Leave a Comment