ముగిసిన చర్చలు

 హైదరాబాద్ హౌస్ లో మోడీ-ట్రంప్ కీలక చర్చలు జరిపారు. ఆరోగ్యం, ఆయిల్ కార్పొరేషన్లపై మూడు ఒప్పందాలు జరిగాయి. ఇంధనంపై రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం ట్రంప్ – మోడీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మోడీ దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ సతీసమేతంగా భారత్ రావడం ఆనందం కలిగించిందని, గత ఎనిమిది నెలల్లో తానూ, ట్రంప్ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తు చేశారు. 

అమెరికా – భారత్ మధ్య స్నేహ బంధం పెరిగిందని, 21వ శతాబ్దానికి అమెరికా – భారత్ ముఖ్యమైందని చెప్పారు. అమెరికా – భారత్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని మోడీ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం  కృషి చేస్తున్నామని, డ్రగ్స్ పైనా నిరంతరం పోరాడుతున్నామని ప్రధాని మోడీ మీడియా సమావేశంలో చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాుడూ భారత్ పర్యటన అద్భుతంగా సాగిందని చెప్పారు. రెండు దేశాల మధ్య ఫలవంతమైన పర్యటనగా ఇది ఉంటుందని, ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనివని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని, సరిహద్దు ఉగ్రవాదంపై చర్చించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని ట్రంప్ వెల్లడించారు. 

రక్షణ ఒప్పందాలపై చర్చించామని, మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ తెలిపారు. అపాచీ, ఎం-16 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని వివరించారు. ఉగ్రవాదం,సైబర్ నేరాలు,  చొరబాట్లు ఎక్కవైపోయాయని, 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ పై చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. తానేు అధ్యక్షుడిని అయ్యాక భారత్ తో ఆర్థిక బంధం పెరిగిందని, భారత్ లో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. 

 

Leave a Comment