ధాన్యం కొనుగోలులో ఆలస్యం.. పంటపైనే ఆగిన రైతు గుండె..!

ఓ ధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గరే ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఆ పంట దగ్గరే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని జరిగింది.

మండలంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఐలాపూర్ కు చెందిన భీమయ్య అనే రైతు వారం రోజుల కింద వడ్లను తీసుకొచ్చాడు. ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రోజూ ధాన్యం కుప్పల దగ్గర రాత్రంతా కాపలా ఉంటున్నాడు. గురువారం రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్ప మీదే కుప్పకూలిపోయాడు.

భీమయ్య ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య కొనుగోలు సెంటర్ కు వచ్చి చూసింది. భీమయ్య అప్పటికీ నిద్ర లేవలేదు. ఆమె ఎంత లేపినా ఆయన లేవలేదు. దీంతో భీమయ్య గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తూ ఓ రైతు ధాన్యం అమ్ముకోలేక ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.  

Leave a Comment