విగ్గుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు..ఆ తర్వాత డబ్బులు లాగేస్తాడు..!

బట్టతలపై విగ్గు పెట్టుకుని అమ్మాయిలను మోసం చేస్తున్న కేటుగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరానికి చెందిన మహ్మద్ రఫీ అలియాస్ కార్తీక్ వర్మ(29) అనే యువకుడు సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అని కలరింగ్ ఇస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. విగ్గుతో ఉన్న ఫొటోలను పెట్టేవాడు. ఆ ఫొటోలను చూసి చాలా మంది అమ్మాయిలు ఆకర్షితులయ్యేవారు. తనకు పెళ్లి కాలేదని వారితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండేవాడు. 

అనంతరం యువతులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు లాగేవాడు. ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. తాజాగా కూకట్ పల్లిలో కూడా ఓ అమ్మాయితో చనువుగా ఉంటూ ఇలానే డబ్బులు లాగేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న నార్త్ జోన్ పోలీసులు రఫీ అలియాస్ కార్తీక్ వర్మను అరెస్ట్ చేశారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 

కాగా.. కార్తీక్ వర్మ పాలిటెక్నిక్ కోర్సును మధ్యలోనే ఆపేశాడు.. 2010లో వేర్వేరు చోట్ల పనిచేశాడు. 2017లో నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన యువతితో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేధింపులు భరించలేక వాళ్లంతా అతడితో దూరంగా ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ కార్తీక్ అప్పటి నుంచి మోసాలు చేయడం ప్రారంభించాడు.. 

 

Leave a Comment