ఛాతిలో ఇనుప రాడ్డు దిగినా చెక్కుచెదరలేదు..!

ప్రమాదం ఏ విధంగా వస్తుందో చెప్పలేం.. వస్తే మాత్రం విలవిల్లాడి పోతాం.. కానీ ప్రమాదానికి గురైనప్పుడు ధైర్యంగా ఉంటే మృత్యువును జయించవచ్చు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. బతకాలన్న అతడి ఆశ ముందు మృత్యువు తలవంచింది. గుండెకు అతి సమీపంలో 6 అడుగుల పొడవైన ఇనుప రాడ్డు దూసుకుపోయినా అతడు బతికాడు..

పంజాబ్ లోని బఠిండా-దిల్ కంబౌ నేషనల్ హైవేపై ఇటీవల ప్రమాదం జరిగింది. హర్దీప్ సింగ్ అనే వ్యక్తి టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తుండగా శ్రీగురు హరగోబింద్ థర్మల్ ప్లాంట్ సమీపంలో ఆ వాహనం టైర్ పేలి పోయింది. దీంతో ఈ వాహనం ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని డీకొంది. 

దీంతో ఆ వాహనంలోని ఆరు అడుగుల గునపం లాంటి ఇనుప రాడ్డు హర్దీప్ ఛాతిలో దిగబడింది. స్థానికులు హర్దీప్ ను దగ్గర్లోని ఆదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆలస్యం చేయకుండా వెంటనే చికత్స ప్రారంభించారు. ముందుగా శరీరం బయట ఉన్న ఇనుప్ప రాడ్డును కట్టర్ సాయంతో కట్ చేశారు. 

తర్వాత ఆరుగురు సర్జన్లు.. 15 మంది ఆరోగ్య సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. వైద్యులు దీనిని ఓ సవాలుగా తీసుకుని ఎంతో శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ఇనుప రాడ్డు కొన్ని అంగుళాలు కిందకు దిగితే గుండె ముక్కులు ముక్కులయ్యేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం హర్దీప్ సింగ్ కోలుకుంటున్నట్లు వెల్లడించారు. 

Leave a Comment